2022లో అమెరికా జారీ చేసిన ప్రతి ఐదు విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే దక్కిందని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ తెలిపారు. భారత్ జనాభాను ప్రపంచ జనాభాతో పోల్చి చూస్తే ఇది చాలా ఎక్కువని వ్యాఖ్యానించారు. ఏడో విద్యార్థి వీసా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబైలోని కాన్సులేట్ల ద్వారా 4500 స్టూడెంట్ వీసా దరఖాస్తులు పరిష్కరించామని చెప్పారు.
భారతీయ విద్యార్థులు దశాబ్దాలుగా అమెరికాలో వృత్తినైపుణ్యాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని ఎరిక్ గార్సెటీ చెప్పారు. ప్రస్తుతం తాము మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్య వీసా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. రాబోయే నెలల్లో వేల సంఖ్యలో వీసా స్లాట్లు విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఢిల్లీ కార్యాలయంలో గార్సెటీ పలువురు విద్యార్థులకు వీసాలు అందజేశారు. హైదరాబాదులోని అమెరికన్ కాన్సులేట్ లో జరిగిన కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ విద్యార్థులకు వీసాలు అందజేశారు.