అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగం నమోదు అయ్యింది. అక్రమరీతిలో రహస్య డాక్యుమెంట్లను కలిగి ఉన్న కేసులో ఆయనపై అభియోగం మోపారు. గత ఆగస్టులో ఆ దేశానికి చెందిన న్యాయశాఖ మాజీ అధ్యక్షుడి ఇంట్లో సోదాలు చేసి దాదాపు 11 వేల డాక్యుమెంట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సీజ్ చేసిన పత్రాల్లో దాదాపు వంద వరకు క్లాసిఫైడ్ కాగా, మరికొన్ని టాప్ సీక్రెట్ పత్రాలు ఉన్నాయి. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను ఇంట్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. ఆ డాక్యుమెంట్లలో ఎటువంటి సమాచారం ఉన్నా, భద్రత లేని ప్రదేశాల్లో ఆ డాక్యుమెంట్లు ఉండరాదు. జాక్ స్మిత్ నేతృత్వంలోని బృందం ఈ కేసును విచారించింది. మొత్తం ఏడు అభియోగాలను ట్రంప్‌పై నమోదు చేశారు.
న్యాయాన్ని అడ్డుకోవడం, కుట్ర, అక్రమరీతిలో క్లాసిఫైడ్ సమాచారాన్ని దగ్గర పెట్టుకోవడం లాంటి నేరాభియోగాలు ట్రంప్‌పై నమోదు అయ్యాయి. మంగళవారం రోజున మియామి కోర్టులో ట్రంప్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆ కేసులో ట్రంప్ హాజరుకానున్నట్లు ఆయన తరపున న్యాయవాది వెల్లడించారు.