ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ పోస్టర్‌ను బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి లక్ష్యాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణ వల్ల సీఎం కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ఎజెండా ను ఎన్‌ఆర్‌ఐలందరికీ చేరుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా టోర్నీని నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని ఆమె అభినందించారు.
నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతీ గ్రామానికి స్టేడియం నిర్మించనున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని భారతీయులకు, ఎన్‌ఆర్‌ఐలకు తెలిసేలా క్రికెట్ టోర్నీని ఎంచుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బాబా ఫసియుద్దిన్ ,సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణ రెడ్డి, రమేష్ చారి, బీ ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.