ఈజిప్టులో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ లభించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సిసి దీనిని అందజేసి సత్కరించారు. దేశంతోపాటు మానవాళికి విశేష సేవలు అందించే వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు ఈ పురస్కారం అందిస్తున్నారు. 1915లో దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి ఇది 13 వ పురస్కారం కావడం విశేషం. మూడు చదరపు బంగారు యూ నిట్లతో కూడిన స్వచ్ఛమైన బంగారు కాలర్‌తో ఉండే ఈ పురస్కారంపై గత చారిత్రక వైభవాన్ని గుర్తు చేసే ఫారోనిక్ పాలకుల సంకేతాలు ఉండడం విశేషం.
మొదటి యూనిట్ దుష్టశక్తుల నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశాన్ని ప్రతిబింబించగా, రెండో యూనిట్ నైలు తీసుకువచ్చే వైభవాన్ని, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. మూడో యూనిట్ సంపదను, సహనాన్ని సూచిస్తుంది. ఈ మూడు యూనిట్లు మణులు, రత్నాలు పొదిగిన వృత్తాకార బంగారు పుష్పంతో ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఈ పతకం మధ్యలో నైలునది పొడుచుకు వచ్చినట్టుండే చిహ్నం ఉంటుంది. అది ఉత్తర (బెరడు)దక్షిణ (కమలం) భాగాలను కలిపినట్టు కనిపిస్తుంది.