అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది అందరూ తాము కరోనా టీకా తీసుకున్నట్లు ఆధారం చూపించడం లేదా ప్రతి వారం కోవిడ్ 19 టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ గేవిన్ న్యూసన్ తెలిపారు. ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ తప్పకుండా ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మహమ్మారి నుంచి మనల్ని కాపాడేది కేవలం టీకా మాత్రమేనని ఈ సందర్భంగా గవర్నర్ ఉపోద్ఘాటించారు.
ఒక తండ్రిగా నేను పిల్లలను మళ్లీ పూర్తి స్థాయిలో పాఠశాలల్లో చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే క్లాస్‌రూంలో కూడా విద్యార్థులు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నిబంధన ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ దడ పుట్టిస్తున్న నేపథ్యంలో కాలిఫోర్నియా ఈ నిర్ణయం తీసుకుందని, డెల్టా ప్రభావం ప్రధానంగా పిల్లలపై అధికంగా ఉంటుందని గేవిన్ గుర్తు చేశారు.