ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయిరాజేష్ దర్శకత్వం వహించారు. ఎస్.కె.ఎన్. నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ బేబీ సినిమా నాకు బాగా నచ్చింది. మన జీవితంలో జరిగిన సంఘటనలతో స్ఫూర్తిపొందితేనే ఇలాంటి సినిమాలు తీయగలం. ఈ సినిమా గురించి గంటసేపు మాట్లాడగలను. ఇందులో చాలా అంశాలు నాకు నచ్చాయి అన్నారు. చిన్న సినిమాలను థియేటర్‌లో ప్రేక్షకులు చూడటం లేదన్నది అబద్ధం. కథ బాగుంటే వారు తప్పకుండా ఆదరిస్తారు. అందుకు బేబీ విజయమే నిదర్శనం. తెలుగమ్మాయిలు ఇండస్ట్రీకి ఎక్కువగా రావడం లేదని బాధపడేవాణ్ణి. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది. ఇకపై తెలుగమ్మాయిలే మన సినిమాల్లో ఎక్కువగా కనిపించాలని కోరుకుంటున్నా. తెలుగు సినిమా తగ్గేదేలే అన్నారు. అల్లు అర్జున్ ప్రోత్సాహంతోనే తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని నిర్మాత ఎన్.కె.ఎన్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ గారు నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తారు. ఈ సినిమా డ్యాన్స్ విషయంలో ఆయన పాటలను చూసి ప్రాక్టీస్ చేశా అని ఆనంద్ దేవరకొండ చెప్పారు.
