వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మట్కా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలు. కరుణకుమార్ దర్శకుడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, దర్శకుడు మారుతి కెమెరా స్విఛాన్ చేశారు. దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్‌చంద్ర, కన్నడ కిషోర్, అజయ్‌ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మట్కా అనేది ఓ రకమైన జూదం. 1958-82 మధ్యకాలంలో వైజాగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. యావత్ దేశాన్ని కదిలించిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కించబోతున్నాం. ఇందులో వరుణ్‌తేజ్‌ను నాలుగు విభిన్న గెటప్స్‌లో చూపించబోతున్నాం. 60వ దశకాన్ని తలపించేలా భారీ సెట్‌ను నిర్మించబోతున్నాం అన్నారు. యూనివర్సల్ కథాంశమిదని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రియాసేత్, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, ఆర్ట్: సురేష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.