మరికొద్ది నెలల్లో క్లాసులు మొదలవుతాయనంగా కెనడాలోని నార్తన్ కాలేజీ స్కార్‌బరో క్యాంపస్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇచ్చిన అడ్మిషన్ లెటర్లను ఉపసంహరించుకుంటున్నట్టు తాజాగా ప్రకటించింది. దీంతో, భారతీయులు, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారిలో టెన్షన్ మొదలైంది. కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న విద్యార్థులకు కాలేజీ నిర్ణయం ఆశనిపాతంగా మారింది. నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి ఆవరించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భారీగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తడంతో కొన్ని అఫర్ లెటర్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని కాలేజీ అధికారి ఒకరు తెలిపారు. అయితే విద్యార్థులు చెల్లించిన ఫీజు మొత్తాన్నీ తిరిగి ఇచ్చేస్తామని కాలేజీ ప్రకటించింది. అంతేకాక, విద్యార్థులు అడ్మిషన్లు పొందిన ఇతర సంస్థలకు ఈ ఫీజలు బదిలీ చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)