దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢల్లీిలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని, ఆ తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 140 కోట్ల భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. బాపూజీ చూపిన అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించామన్నారు. స్వాతంత్య్ర సమరంలో అసువులుబాసిన మహానుభావులకు నమస్సుమాంజలులు పలుకుతున్నాని తెలిపారు.
ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతి జరుపుకుంటున్నామని చెప్పారు. రాణి దుర్గావతి, మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిదన్నారు. మణిపూర్‌లో జరిగిన హింత అత్యంత బాధాకరమైనదని తెలిపారు. కొద్దిరోజులుగా అక్కడ శాంతి నెలకొంటున్నదని, మణిపూర్‌కు యావజ్జాతి అండగా నిలుస్తున్నదని చెప్పారు. మణిపూర్‌లో నూరు శాతం శాంతి సాధించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. సంపూర్ణ శాంతి సంకల్పంతో చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలతో సహా పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. అయితే ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేడయం ఇది పదోసారి. వేడుకల సందర్భంగా ఎర్రకోట బయట, లోపట ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.