అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. 2020 దేశాధ్యక్ష ఎన్నికల్లో జార్జియా రాష్ట్ర ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని నెలల్లో ట్రంప్‌పై నమోదు అయిన నాలుగు క్రిమినల్ కేసు ఇది. రాబోయే అధ్యక్ష ఎన్నికలపై కన్నేసిన రిపబ్లికన్ నేత ట్రంప్‌తో పాటు మరో 18 మందిపై తాజా కేసులో నేరాభియోగాలు నమోదు అయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు, అనవసరంగా జోక్యం చేసుకున్నట్లు ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే తనపై నమోదు అయిన 13 అభియోగాలను ట్రంప్ ఖండించారు. రాజకీయ కక్షతో ఆ ఆరోపణలు చేసినట్లు ఆయన తెలిపారు.
జార్జియా ప్రాసిక్యూటర్ ఫాని విల్లిస్ తన తీర్పును వెలువరించారు. ఆ రాష్ట్ర ఎన్నికల్లో జోక్యం చేసుకున్న అంశంపై 2021 ఫిబ్రవరిలో ఆమె దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై 98 పేజీల రిపోర్టును ఆమె తయారు చేశారు. ఆ తీర్పును ప్రకటించారు. ఆగస్టు 25వ తేదీలోగా సరెండర్ కావాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ బృందం ఈ ఆరోపణలపై స్పందించింది. ప్రాసిక్యూటర్‌ను ఆవేశపూరిత పక్షపాతిగా అభివర్ణించింది. ఈ ఆరోపణలు చేసిన వారే 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారని పేర్కొంది. వారు ట్రంప్ ప్రచార ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని యత్నిస్తున్నట్టు వెల్లడించింది.