సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. ఆ దేశ తొమ్మిదో అధ్యక్షుడిగా ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్ సాంగ్‌పై ఆయన గెలుపొందారు. ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నానికి 70.4 శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థులు కోక్ సోంగ్‌కు 15.7 శాతం, టాన్ కిన్ లియన్‌కు 13.88 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విషయాన్ని ఆ దేశ ఎన్నికల కమిటీ ధ్రువీకరించింది. ప్రస్తుత అధ్యక్షుడు హలిమా యాకోబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13న ముగియనున్నది. అనంతరం థర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఆయన పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు కావడం విశేషం. ఫాదర్ ఆఫ్ పాథలజీ ఇన్ సింగపూర్‌గా పేరుగాంచిన కే షణ్ముగరత్నం థర్మన్ తండ్రి. ధర్మాన్ 2001లో రాజకీయాల్లోకి వచ్చారు. పీపుల్స్ యాక్షన్ పార్టీ నుంచి రెండు దశాబ్దాలకు పైగా వివిధ మంత్రి పదవుల్లో పనిచేశారు. 2011 నుంచి 2019 మధ్య సింగపూర్ ఉప ప్రధానిగా పనిచేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఈ ఏడాది జూలైలో ప్రజా, రాజకీయ పదవులకు రాజీనామా చేశారు.