ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది.చంద్రబాబు బస చేసిన నంద్యాలలోని ఆర్.కె.ఫంక్షన్ హాల్ దగ్గర ఉత్కంఠ నెలకొంది. ఆ ప్రదేశానికి అధికసంఖ్యలో టిడిపి శ్రేణులు తరలివచ్చారు. అదే సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముందుగానే అనంతపురం నుంచి పోలీసు బృందాలు నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను అక్కడ మొదట మోహరించారు. అవసరమైనచోట్ల ముందుగానే పక్క ప్రణాళికతో పోలీసులు బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
అనంతరం చంద్రబాబు వద్దకు చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు మొదట వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.తెదేపా శ్రేణుల్ని నెట్టుకుంటూ పోలీసులు వెళ్లారు. చంద్రబాబు ప్రధాన భద్రత అధికారి, ఎన్ఎస్జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఎన్ఎస్జీ కమాండెంట్‌కి పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు అర్ధరాత్రి చంద్రబాబుని నిద్రలేపడం సరికాదని, ఆయన ఎక్కడికీ పారిపోయే వ్యక్తి కాదంటూ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్సు డోర్ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులను తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి.
మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు బస చేస్తున్న ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపాలని తెదేపా నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయమై చంద్రబాబుకు తప్ప ఎవ్వరికీ సమాధానం చెప్పమని పోలీసులు పేర్కొన్నారు. కేసు ఏంటని నాయకులు, న్యాయవాదులు అడిగినా వారు సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం చంద్రబాబును శనివారం ఉదయం 8.30 గంటలకు విజయవాడకు సిఐడి పోలీసులు తరలించారు. కాగా అరెస్ట్ చేసే సమయంలో ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటున్నారని నిలదీశారు. అయితే దీనిపై తాము హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చినట్లు సిఐడి పోలీసులు తెలిపారు. ఇదే కేసులో మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడకు తరలించారు.