భారత్ అధ్యక్షతన ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ నేటి పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితితో పాటు అన్ని అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిందేనని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ప్రధానంగా ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)ని విస్తరించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఐరాసలో సభ్యదేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, భద్రతా మండలిలో మాత్రం సభ్య దేశాల సంఖ్య మారడం లేదని అన్నారు. ప్రపంచాన్ని మరింత మెరుగైన భవిష్యత్తు దిశగా నడిపించేందుకు నేటి ప్రపంచ వాస్తవికత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఐరాస ఏర్పడినప్పుడు, ఇప్పటితో పోలిస్తే అప్పటి ప్రపంచ పరిస్థితులు వేరని, ఆ సమయంలో సభ్య దేశాలు 51 మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే నేడు ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాల సంఖ్య దాదాపు 200కు చేరువైందని, అయితే యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య మాత్రం మారలేదని అభిప్రాయపడ్డారు. రవాణా, కమ్యూనికేషన్, ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయని, ఇందుకు అనుగుణంగా మన కొత్త ప్రపంచ నిర్మాణం కూడా ఉండాలని, ఆ దిశగా తక్షణ నిర్ణయాలు ఉండాలని మోదీ పేర్కొన్నారు.