ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 800. మురళీధరన్ పాత్రలో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేం మధుర్ మిట్టల్ నటించగా, మురళీధరన్ భార్య మదిమలర్‌గా మహిమా నంబియార్ కనిపిస్తారు. ఎం.ఎస్.శ్రీపతి దర్శకుడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడారు. క్రికెట్ అంటే రికార్డులు కాదు. స్నేహితుల్ని చేసుకోవడం. మైదానంలో మేం వేరువేరు దేశాలతో ఆడినప్పటికీ నేనూ, సచిన్, అనిల్‌కుంబ్లే, గంగూలీ స్నేహితులుగా ఉన్నాం. మా స్నేహం దేశాలకు అతీతమైనది అన్నారు. నా కథతో సినిమా అన్న ఫీలింగే గుండెను బరువు చేస్తున్నది. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.
వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రపంచ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. ఆటగాడిగానే కాదు, మనిషిగా కూడా ఆయన ఆదర్శప్రాయుడే. ముత్తయ్య గొప్ప మనసున్న వ్యక్తి, నిగర్వి, ఈ తరం యువతకు రోల్ మోడల్. అలాంటి వ్యక్తి జీవితంతో సినిమా రావడం ఆనందంగా ఉంది. ఈనాటికీ ఆయన నన్ను ఇన్‌స్పైర్ చేస్తూనే వున్నాడు. ఆయనతో కలిసి ఆడాను. ఆపోజిట్‌గా ఆడాను. ముత్తయ్య లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని అన్నారు. అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.