త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 2018 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించామని అలాగే ఈసారి కూడా అటు సోషల్ మీడియా, టెలీఫోనిక్ కాంపెయిన్ నిర్వహిస్తామన్నారు. ప్రత్యక్షంగా కొన్ని నియోజక వర్గాలలో పర్యటించి కేసీఆర్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దళితబంధు, రైతు సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఉచిత కరెంట్ వంటి పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలను అమలుచేస్తూ ప్రజల నుంచి హర్షాతిరేకాలను పొందుతున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయ కేతనం ఎగురవేస్తదని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికలలో ప్రచారాన్ని నిర్వహిస్తామన్నారు. ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొననున్న తమ కార్యవర్గ సభ్యుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఏ దిక్కులేని వారికి ఆసరాతో అండగా, పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో ఆర్థిక భరోసా కల్పించారని పేర్కొన్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేలా గొర్రెలు, చేప పిల్లల పంపిణీ చేపట్టారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.