రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, అన్మోల్శర్మ కెమెరా స్విఛాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న ఈ చిత్రంలో రవితేజ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందని, కథానాయిక ఎవరనేది త్వరలో తెలియజేస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జీకే విష్ణు, సంగీతం: తమన్, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.