అమెరికాలో విదేశీయులకు శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఏండ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది వృత్తి నిపుణులకు కొత్త ఆశలు చిగురించే కబురు చెప్పింది ఆ దేశ ప్రభుత్వం నియమించిన కమిటీ. గ్రీన్‌కార్డు దరఖాస్తుల పరిశీలనకు దశాబ్దాల సమయం పడుతున్న నేపథ్యంలో అప్పటివరకు దేశంలో నివసిస్తూ, ఉద్యోగాలు చేసుకొనేందుకు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్ అథెంటికేషన్ కార్డ్ (ఈఏసీ)లను జారీచేయాలని, అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ నియమించిన ఏషియన్ అమెరికన్, నేటివ్ హవాయిన్, పసిఫిక్ ఐలాండర్ (ఏఏఎన్‌హెచ్‌పీఐ) వ్యవహారాల కమిటీ’ అమెరికా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రాథమిక దశ పరిశీలనలో ఉన్నవారికి ఈ కార్డులు ఇవ్వాలని కోరింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదిస్తే వేల మంది విదేశీయులకు మేలు కలుగుతుంది.