లూమియర్ అంతర్జాతీయ సంస్థ సింగపూర్లో అక్టోబర్ 21న నిర్వహించిన అందాల పోటీలలో సింగపూర్ తెలుగు సమాజం పూర్వ కమిటీ, జీవితకాల సభ్యురాలు చిలకల విజయ దుర్గ మిసెస్ ఆసియా ప్రపంచ సుందరి-2023 విజేతగా నిలిచారు.ఎంతో ఆర్భాటంగా కన్నులవిందుగా జరిగిన ఈ కార్యక్రమంలో పోటీదారులందరూ కూడా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. అసాధారణమైన తేజస్సు, ప్రతిభతో ఆహుతులు అందరికి ఉత్సాహం నిండిన ఒక మరపురాని సాయంత్రాన్ని అందించారు . పోటాపోటీగా జరిగిన ఈ పోటీలలో విజేతను ఎంపిక చేయడంలో న్యాయనిర్ణేతలు చాలా కష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నామని తెలియజేసారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/singapore1-271023.jpg)
ఈ పోటీలలో విజేతగా నిలిచిన విజయ తన సమర్ధత, అద్భుతమైన ప్రదర్శన, అచంచలమైన సంకల్పం, చరిష్మాతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకర్షించించి కిరీటాన్ని దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన కిరీటంతో పాటు ఆమెను ఆసియా పసిఫిక్ క్వీన్ ఆఫ్ సబ్స్టాన్స్-2023, మిసెస్ సింగపూర్-మిసెస్ కైండ్నెస్ వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్ కూడా వరించాయి. ఈ సందర్భంగా ఆమెకు పోటీ నిర్వాహకులు, స్పాన్సర్లు, మద్దతుదారులు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.
విజయ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సింగపూర్లో నివసిస్తున్నట్లు తెలిపారు. మొదటి ప్రయత్నం లోనే మిసెస్ ఆసియా ప్రపంచ సుందరిగా ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందన్నారు. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితుల అపారమైన ప్రేమ, ప్రోత్సాహం, సింగపూర్ తెలుగు సమాజం సహకారం మరియు అందరి మద్దతు వలనే ఇవన్నీ సాధ్యం అయ్యాయని తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను, కష్ఠాలను ఎదుర్కొన్నానని అవన్నీ అధిగమించి విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే సమాజంలో మహిళాభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలతో సానుకూల ప్రభావం చూపడానికి ఈ అవకాశాన్ని ఉపయోగిస్తానని చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/singapore3-271023.jpg)
లూమియర్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ విజయ ప్రదర్శన సింగపూర్ సమాజంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ప్రేరణ, మహిళా సాధికారతకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే తమ సంస్థ ద్వారా మహిళలను ప్రోత్సహించడానికి, స్వచ్ఛంద కార్యక్రమాలు, హృదయానికి దగ్గరగా ఉండే సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తోడ్పడుతుందని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/Mss_ca3a3c8e22-1024x576.jpg)
సింగపూర్ సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఘనత సాధించిన తెలుగు వనిత తెలుగు సమాజ జీవితకాల సభ్యురాలు కావడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపారు. కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్, సమాజ కార్యవర్గ సభ్యులు అందరూ విజయకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.