వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత మైక్ పెన్స్ ప్రకటించారు. అనేక చర్చల తనంతరం ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాని చెప్పారు. లాస్‌వెగాస్‌లో జరిగిన రిపబ్లికన్ యూదు కూటమి వార్షిక సదస్సులో ఈమేరకు తెలిపారు. తన ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. రిపబ్లికన్ నేతలకు మద్దతుగా ఉంటానని, వారి విజయం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. అయితే ఆర్థిక సవాళ్లు, పోల్ సంఖ్యలో వెనుకబడి ఉండటంతో పెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, పెన్స్.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు ఇండియానా గవర్నర్‌గా, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ నామిషనేషన్ కోసం డొనాల్డ్ ట్రంప్, పెన్స్తోపాటు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీపడుతున్నారు. ఇప్పుడు పోటీ నుంచి పెన్స్ తప్పుకోవడం విశేషం.