గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. గడిచిన కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస తనిఖీలు నిర్వహిస్తున్న ఆ దేశ భద్రతాధికారులు ఉల్లంఘనదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడం చేస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన మూడు నెలల్లో ఏకంగా 12వేల మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తాజాగా వెలువడిన అంతర్గత మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిపిన సోదాల్లో ఈ మేరకు ఉల్లంఘనదారులను గుర్తించి దేశం నుంచి వెళ్లగొట్టింది. వీరిలో కొందరు ప్రజా నైతిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే రెసిడెన్సీ, కార్మిక చట్టాల ఉల్లంఘనదారులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిపింది.