పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించింది. నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ సడలింపులు అమల్లో ఉంటాయని థాయ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. భారత్ , తైవాన్ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్‌లాండ్‌లో పర్యటించొచ్చని తెలిపారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కాగా, థాయ్‌లాండ్‌కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్‌నుంచే ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని థాయ్ ప్రభుత్వం ఇటీవలే చైనా పర్యాటకులకు ఫ్రీ వీసా ఎంట్రీకి అనుమతిచ్చింది. ఇప్పుడు తాజాగా భారత్, తైవాన్‌కు ఆ వెసులుబాటు కల్పించింది.
ప్రభుత్వ డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకూ 22 మిలియన్ల మంది థాయ్‌లాండ్ సందర్శనకు వెళ్లారు. దీని ద్వారా 927.5 బిలియన్ బాట్ (25.67 బిలియన్ డాలర్లు) ఆదాయం సమకూరింది. ఇక ఈ ఏడాది 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకుంది.