అక్టోబర్ 7న హమాస్ అనూహ్య దాడి నేపథ్యంలో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. రష్యాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సిరియాపై కూడా దాడులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, రష్యా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. దశాబ్దాలుగా ప్రపంచ యుద్ధ భూమిగా సిరియా మారింది. ఇజ్రాయెల్ ఆక్రమించిన సిరియాలోని గోలన్ హైట్స్ వద్ద ఇస్లామిక్ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సుమారు వెయ్యి మంది సైనికులను అమెరికా మోహరించింది. సిరియా ఉత్తరాన పట్టున్న కుర్దిష్ గ్రూపులతో టర్కీ పోరాడుతున్నది. కాగా , సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ అధికారంలో ఉండటానికి ఇరాన్, రష్యా సహకరిస్తున్నాయి. దీంతో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ ఫైటర్స్‌తోపాటు రష్యా ఏర్పాటు చేసిన ఎయిర్‌బేస్ వద్ద ఆ దేశ సైనికులు సిరియాలో ఉన్నారు. దీంతో సిరియాలోని ఉగ్రవాద సంస్థలపై దాడులకు ముందు ఆ విషయాన్ని ముందుగా రష్యాకు ఇజ్రాయెల్ చెప్పేది.