తమ దేశంలో ఉన్న సైనికులను భారత్ ఉపసంహరించుకోవాలని మాల్దీవుల నూతన అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కోరారు. తమ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బలమైన తీర్పునిచ్చారని, దానిని భారత్ గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు స్వీకరించారు. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయనతో మర్యాపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత సైనికులను ఉపసంహించుకోవాలని కోరినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సందర్భంగా మాల్దీవుల నుంచి ఇండియన్ మిలిటరీని తిరిగి పంపిస్తామని ముయిజు అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన గెలుపు నేపథ్యంలో ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే హిందూ మహా సముద్రం లో కీలకమైన పొరుగుదేశం కావడంతోపాటు, అక్కడ అనేకమంది భారతీయులు నివసిస్తుండటం గురించి రిజిజు ప్రస్తావించారు. అందువల్ల నిర్మాణాత్మక సంబంధాలను పెంచుకునేందుకు, దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు.