అమెరికాలో భారత్‌కు చెందిన మరో విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఒహియోలోని యూనివర్సిటీ ఆప్ సిన్సినాటీ మెడికల్ స్కూల్‌లో చదువుతున్న ఢిల్లీకి చెందిన 26 ఏండ్ల ఆదిత్య అడ్లఖ దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. ఈ నెల 9న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్రన్ హిల్స్ వయాడక్ట్‌లో ఓ కారు గోడను ఢీకొట్టి ఆగిపోయింది. దాని నిండా బుల్లెట్ రంధ్రాలు ఉండడం, లోపల ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉండడంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆదిత్యను దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మరణించాడు.
మరోవైపు కాల్పుల్లో ఆదిత్య చనిపోవడం పట్ల యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాట్ మెడికల్ స్కూల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతడి కుటుంబానికి సంతాపం తెలిపింది. ఉత్తర భారత్‌కు చెందిన ఆదిత్య 2018లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంజాస్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. 2020లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. అనంతరం వైద్య విద్యలో ఉన్నత కోర్సులు చేసేందుకు అమెరికా వెళ్లాడు.