ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నగరంలోని ఓ పాఠశాల బయట దుండగుడు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు విద్యార్థులు సహా ఐదుగురు గాయపడ్డారు. దీంతో వందలాది మంది డబ్లిన్ వీధుల్లో నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు పలు వాహనాల ను దగ్ధం చేయడంతోపాటు దుకాణాలను లూటీ చేశారు. నగరంలోని పార్ణెల్ స్క్వేయర్లోని ప్రాథమిక పాఠశాల వద్ద ఓ దుండగుడు ఐదుగురిపై కత్తితో దాడికిపాల్పడ్డాడు. వారిలో ఐదేండ్ల చిన్నారి సహా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
అయితే దాడికి పాల్పడింది విదేశీయుడంటూ ప్రచారం జరగడంతో దాడికి నిరసనగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కార్లు, బస్సులకు నిప్పుపెట్టారు. పలు దుకాణాలను కొల్లగొట్టారు. వలసదారులు ఉన్న ప్రాంతాల్లో ఐర్లాండ్ జెండాలు పట్టుకొని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.