కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లారని బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ బెహ్రాన్ అధ్యక్షులు సతీష్ రాదారపు ఆరోపించారు. కోరుట్లలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ గల్ఫ్ కుటుంబాల మీద కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. గల్ఫ్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఫిలిపిన్స్ తరహా చట్టలను తీసుకురావాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని వాపోయారు. ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తీసుకున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల గల్ఫ్ వలసలు చాలా తగ్గాయని పేర్కొన్నారు.
బెహ్రాన్ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సుమన్ అన్నారం మాట్లాడుతూ భారతీయులకు తక్కువ జీతాలు ఇచ్చినా సరిపోతుందని కేంద్రం గల్ఫ్ దేశాలకు సూచించడం సిగ్గు చేటని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరారు. కేసీఆర్ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐల పక్షాన సీఎం కు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామని వెల్లడించారు. కోరుట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సతీష్ గొట్టెముక్కల , మారుతీ మ్యాక, సుభాష్ , ప్రహ్లాద కిశోరె , సూర్య గన్నరపు పాల్గొన్నారు.