ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల ఒప్పందానికి మరో రెండ్రోజుల పొడిగింపు లభించింది. ఈ విషయంలో అమెరికా, ఖతార్, ఈజిప్ట్, స్పెయిన్, ఐరోపా సమాఖ్య(ఈయూ) చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ అంశంపై ఈజిప్ట్ సమాచార విభాగం అధికారి దియా రష్వాన్ తాజా ఒప్పందం వివరాలను వెల్లడించారు. నాలుగు రోజుల కాల్పుల విరమణ బందీలు-ఖైదీల మార్పిడి ఒప్పందం ముగిసింది. రెండ్రోజులపాటు కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న ప్రతి 10 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తే, హమాస్ 30 మంది బందీలను ముఖ్యంగా మహిళలు, చిన్నారులను అప్పగిస్తుంది. ఇలా రెండ్రోజుల పాటు 20 మంది పాలస్తీనా ఖైదీలు-60 మంది బందీల మార్పిడి కొనసాగుతుంది. ఆ తర్వాత ఇదే నిష్పత్తిలో అంగీకారం కుదిరితే, కాల్పుల విరమణ మరిన్ని రోజులు ఉంటుంది. ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ ప్రకటించిన నోఫ్లై జోన్ కొనసాగుతోంది అని ఆయన వివరించారు.