సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నినట్లు అభియోగాలు నమోదైన కేసులో అమెరికా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నది. ఈ కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ చీఫ్‌ను భారత్‌కు పంపినట్లు సమాచారం. అధ్యక్షుడి ఆదేశాల మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్ గత ఆగస్టులో భారత్‌కు వచ్చినట్లు పేర్కొంది. పన్నూన్ హత్యకు ఓ భారతీయుడు కుట్ర చేస్తున్నాడని అమెరికా వర్గాలు గుర్తించిన తర్వాతే బర్న్స్ పర్యటన జరిగిందని తెలిపింది.
భారత్‌లోని ఓ అధికారి కనుసన్నల్లోనే పన్నూన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు ఆగస్టులో భారత్‌కు వచ్చిన విలియం బర్న్స్ ఇక్కడి రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్ రవి సిన్హాతో భేటీ అయినట్లు పేర్కొంది. పన్నూ హత్యకు జరిగిన కుట్రపై విచారణ అవసరమని, అందుకు భారత్ సహకరించాలని ఆయన కోరినట్లు తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా భారత్ నుంచి అమెరికా స్పష్టమైన హామీ కోరినట్లు సమాచారం.