Namaste NRI

ఎర్రబెల్లి దయాకర్ పై ఝాన్సీ యశస్వినిరెడ్డి సంచలన విజయం

తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి అనూహ్యంగా బరిలో నిలిచి గెలుపొందారు.పాలకుర్తి లో ఇంతవరకూ ఓటమన్నదే ఎరుగని సీనియర్ నాయకుడైన ఎర్రబెల్లి దయాకర్‌ రావు పై ఎలాంటి రాజకీయ అనుభవం లేని 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డి గెలుపొందారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగి 2018లో బీటెక్‌ పూర్తి చేసిన యశస్విని వివాహం అనంతరం అమెరికా వెళ్లి అక్కడ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్నారు. అయితే ఈ సారి అనూహ్యంగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అమెరికా నుంచి వచ్చిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారంలో రాణించి పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక కార్యక్రమాలు చేపడుతుండేవారు.ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే.. భారత పౌరసత్వం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు బదులు ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఇచ్చింది. అప్పటివరకూ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, అధికార పార్టీ మంత్రిగా, ఇంతవరకు ఓటమి తెలియని నేతగా పేరున్న ఎర్రబెల్లిపై ఆమె పోటీ చేస్తుండడంతో రాష్ట్రంలో అందరి దృష్టి ఆమెపై పడింది.

ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇప్పటి వరకూ ఓటమన్నదే ఎరుగని ఎర్రబెల్లి దయాకరరావు రాజకీయ చరిత్రను కూకటి వేళ్లతో పెకిలించిన ఘనత హనుమాండ్ల ఝాన్సీ యశస్విని రెడ్డి దేనని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. దయాకరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి యశశ్వినిరెడ్డి 46,402ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి మెజారిటీతో యశస్విని రెడ్డి సత్తా చాటారు.ఈ సందర్భంగా గెలుపొందిన యశశ్విని రెడ్డి మాట్లాడుతూ… ఎర్రబెల్లి దయాకర్ రావు 40 ఏళ్ల రాజకీయ చరిత్రకు పాలకుర్తి ప్రజలు స్వస్తి పలికారని అన్నారు. తెలంగాణ లో మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 64 సీట్లలో గెలిసి అధికారం కైవసం చేసుకోగా బారాసా 39, భాజాపా 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక చోట విజయం సాధించాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events