నాని కథానాయకుడిగా రూపొందిన చిత్రం హాయ్ నాన్న. మృణాళ్ ఠాకూర్ కథానాయిక. బేబీ కియారా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి దర్శకుడు శౌర్యువ్. నిర్మాతలు మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి. సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా హాయ్ నాన్న సంగీత విభావరి నిర్వహించింది. భారీగా అభిమానులు పాల్గొన్న ఈ వేడుకలో కమల్‌హాసన్ గుణ సినిమాలోని కమ్మనీ నీ ప్రేమలేఖలే రాసింది హృదయమే అని సాగే ఇళయరాజా పాటను నాని ఆలపించి అందర్నీ ఆనందింపజేశాడు. మృణాళ్ఠాకూర్ కూడా హాయ్ నాన్న సినిమాలోని ఒడియమ్మా, పాటకు నర్తించి, అందర్నీ అలరించింది. ఈ సినిమాలో నాని నటనకు అందరూ ప్రేమలో పడిపోతారని, సాంకేతికంగా ఈ సినిమా అద్భుతమని మృణాళ్ఠాకూర్ అన్నారు. హాయ్ నాన్న లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయని ప్రియదర్శి చెప్పారు.