తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎల్లా హోటల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు మరింత జాప్యం కానుంది. సీఎం ఎవరో అధిష్టానం ఫిక్స్ చేయాల్సి ఉండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు ఏఐసీసీ పెద్దలు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బిజీగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈరోజు రాత్రికి ఢిల్లీకి ఏఐసీసీ పరిశీలకులు వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి శివకుమార్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన తర్వాత సీఎం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాజా పరిణామాల కారణంగా ఈనెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.