స్వదేశీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అధిక ప్రాధాన్యం కల్పించేలా విదేశీ నిపుణుల వీసాల జారీ విషయంలో యూకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వలసలను తగ్గించేలా రిషి సునాక్ సర్కారు రాడికల్ యాక్షన్ ప్రకటించింది. వచ్చే ఏడాది బ్రిటన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కీలక చర్యలు చేపట్టారు.ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలోకి వలసల నిరోధిస్తానని చేసిన ప్రకటనకు అనుగుణంగా ప్రస్తుతం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక వేతనాలున్న వారికే ఉపాధి వీసాలు దక్కేలా కొత్త నిబంధలు అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఈ మేరకు బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ హౌస్ ఆఫ్ కామన్స్‌లో బిల్లు పెట్టారు.
ఈ నిర్ణయం దాదాపు 3 లక్షల మంది వలసదారులపై ప్రభావం చూపుతుందని యూకే హోమ్ శాఖ కార్యాలయం పేర్కొంది. కొత్త చర్యల ఆధారంగా వారు యూకేలోకి ప్రవేశించడానికి అనర్హులవుతారని, ఇందులో నైపుణ్యం కలిగిన విదేశీయులకు కనీస వేతనం మూడో వంతు పెరుగుతాయని పేర్కొంది.