అమెరికాలో నివసిస్తూ సుదీర్ఘకాలంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కీలక బిల్లు ఒకటి అమెరికా చట్టసభ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్‌కోర్మిక్‌తో కలిసి ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులైన రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌ను తగ్గించే బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే వేలాదిమంది ఇండియన్ అమెరికన్లకు ప్రయోజనం కలుగుతుంది. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు కోసం వీరంతా దశాబ్దాల తరబడి కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
ఈ బిల్లు ఉపాధి ఆధారిత వలస వీసాలపై ప్రస్తుతం ఉన్న 7 శాతం పరిమితిని తొలగిస్తుంది. ఏటా జారీ చేసే గ్రీన్‌కార్డుల్లో ఒక్కో దేశానికి ఏడు శాతానికి మించి జారీ చేసేందుకు వీలులేకపోవడంతో లక్షలాదిమంది వర్క్ వీసాదారులు ఏండ్ల తరబడి గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఒక్కో దేశానికి ఇచ్చే వాటా 7 నుంచి 15 శాతానికి పెరుగుతుంది. ఈ సందర్భంగా రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ భవిష్యత్తు ఆర్థికవ్యవస్థను నిర్మించేందుకు కృషిచేస్తున్నప్పుడు అధిక నైపుణ్యం కలిగిన కార్మికులను గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్‌లో కొట్టుమిట్టాడేలా చేయడం సరికాదని, అమెరికన్లుగా పూర్తిగా మారలేక దేశానికి పూర్తిగా సహకారం అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు తేవడంలో భాగమైనందుకు గర్విస్తున్నట్టు చెప్పారు.