కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం డెవిల్. అభిషేక్ నామా దర్శకత్వం. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ డెవిల్ చిత్ర విజయంతో మా రెండేళ్ల కష్టం ఫలించింది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం అంత సులభం కాదు. దర్శకుడు ఏడాది పాటు ఈ కథతో ప్రయాణం చేశాడు అన్నారు. ఈ సినిమా మొదలుపెట్టిన కొద్ది రోజులకే మా సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్‌కు గుండె ఆపరేషన్ జరిగింది. మూడు నెలల విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పినా, పద్దెనిమిది రోజుల్లోనే సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేశారు కాబట్టే ఈ విజయం సాధ్యమైంది అన్నారు.
దర్శకనిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రతీ సీన్ కొత్తగా ఉందని, సాంకేతికంగా అన్ని అంశాలు ఉన్నత విలువలతో ఉన్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.