అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని డోవర్ పట్టణంలోని తమ బంగ్లాలో భార్యాభర్తలు, 18 ఏండ్ల యువతి నిర్జీవంగా కనిపించారు. మృతులను రాకేశ్ కమల్ (57), టీనా (54), అరియానా (18)గా గుర్తించారు. రాకేశ్ మృతదేహం దగ్గర తుపాకీ లభ్యం కావడంతో వీరి మరణం వెనుక పలు అనుమానాలు వస్తున్నాయి.
కమల్ దంపతులు మసాచుసెట్స్‌లో అత్యంత ధనవంతులు ఉండే ఓ ఖరీదైన ప్రాంతంలో 2019లో ఓ భవంతిని కొనుగోలు చేశాడు. 19వేల చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతిలో 11 బెడ్‌రూంలు ఉన్నాయి. 2019లో ఈ భవంతిని 4 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఆ భవంతి విలువ 5 మిలియన్ డాలర్లు(రూ.41.26 కోట్లు). ప్రస్తుతం కమల్ దంపతులు ఈ ఇంటిలోనే ఉంటున్నారు. రెండు రోజులుగా కమల్ దంపతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వాళ్ల బంధువు ఒకరు పోలీసుల కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ భవంతికి వెళ్లి చూడగా, ముగ్గురి మృతదేహాలు లభించాయి. ఘటన సమయంలో వీరు ముగ్గురు తప్ప మరెవరూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరి మరణానికి కుటుంబ కలహాలు? లేదా ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే వీరి మరణానికి బయటి వ్యక్తులతో సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.