అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుసరిస్తున్న విధానాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అఫ్గానిస్థాన్ విషయంలో తనిఖీలు లేకుండానే చాలామందిని విమానాల్లో బయటకు తరలిస్తుండటాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే వేల మంది ఉగ్రవాదులు ఈ తరలింపుల్లో భాగంగా విదేశాలకు చేరుకొని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బైడెన్ అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు అప్పగించారు. అమెరికా పౌరులను అక్కడి నుంచి తీసుకురావడానికి ముందే బలగాలను ఉపసంహరించడం దారుణమైన విషయం. తద్వారా వేల మంది అమెరికన్ల ప్రాణాలను ఆయన ప్రమాదంలోకి నెట్టారు. అఫ్గాన్ నుంచి ఇటీవల 26 వేల మందిని బయటకు తీసుకురాగా వారిలో కేవలం 4 వేల మందే అమెరికన్లు. ఎన్ని వేల మంది ఉగ్రవాదులు అఫ్గాన్ నుంచి విదేశాలకు చేరుకొని ఉండొచ్చో దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. తనిఖీలు లేకుండా తరలింపులు చేపట్టడం ఘోర వైఫల్యమే అని ట్రంప్ పేర్కొన్నారు.