ప్రముఖ సినీనటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటిం చింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అలనాటి నటి వైజయంతి మాల బాలి, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రమణ్యంలను పద్మ విభూషణ్ కు కేంద్రం ఎంపిక చేసింది.
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, నటులు మిథున్ చక్రవర్తి, విజయకాంత్ తదితరులను పద్మభూషణ్ వరించింది. తెలంగాణకు చెందిన ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తంగా అవార్డులు దక్కినవారిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. మరణానంతరం 9 మందికి అవార్డులను ప్రకటించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ సీఎం, జన నాయక్ కర్పూరి ఠాకూర్ (మరణానంతరం)కు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.