యూపీఐ సేవలు శ్రీలంక, మారిషస్ దేశాల్లో ప్రారంభమయ్యాయి. భారత, శ్రీలంక, మారిషస్ ప్రధానులు నరేంద్ర మోదీ, రణిల్ విక్రమసింఘే, ప్రవింద్ జుగ్నాథ్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. గత ఏడాది జూలైలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత పర్యటన సందర్భంగా శ్రీలంకలో యూపీఐ సేవలకు సంబంధించి ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండుదేశాల్లో యూపీఐ సేవలను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మూడు దేశాలకు ఇది ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు.
నేడు మనం మన చారిత్రక సంబంధాలను ఆధునిక డిజిటల్ మార్గంలో అనుసంధానిస్తున్నామని, ప్రజల కిచ్చిన అభివృద్ధి వాగ్ధానాలకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఫిన్‌టెక్ కనెక్టివిటీ క్రాస్ బోర్డర్ లావాదేవీల్లో సహాయం చేయడమే కాకుండా సరిహద్దుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో పెద్ద మార్పును తీసుకువచ్చిందని. పల్లెల్లో చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని, ఇందులో సౌలభ్యంతో పాటు వేగం కూడా ఉంటుందన్నారు. నైబర్‌హుడ్ ఫస్ట్ అనేది భారతదేశ విధానమన్నారు. మారిషస్‌లో యూపీఐ సేవల ప్రారంభంపై ఆ దేశ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ హర్షం వ్యక్తం చేశారు.