భూతాపంతో సముద్రమట్టాలు పెరగటం, అమెరికా తూర్పు తీర ప్రాంత నగరాలకు ముప్పు తెచ్చిపెడు తున్నది. దీనికి తోడు మరో భౌగోళిక సమస్య అమెరికాను వెంటాడుతున్నది. న్యూయార్క్, వర్జీనియా, నార్ఫోక్, బాల్టిమోర్ సహా పలు నగరాలు వేగంగా కుంగిపోతున్నాయని, దీనివల్ల 8,97,000 నిర్మాణాలు దెబ్బతింటాయని నాసా నిధులతో ఏర్పాటైన పరిశోధకుల బృందం హెచ్చరించింది. కోట్లాది మంది ప్రజలు ఆధారపడ్డ మౌలిక సదుపాయాలు, వ్యవసాయ భూములు, చిత్తడి నేలలు భూమిలోకి కుంగటం వేగంగా జరుగుతున్నది అని వర్జీనియా టెక్కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్, ఇన్నోవేషన్ ల్యాబ్’ సైంటిస్టులు కనుగొన్నారు. అడవులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు మొదలైనవి ప్రభావితమవుతున్నాయి. వరదలు, తీర ప్రాంత ప్రమాదాలు పెరిగే ప్రమాదముంది అని సైంటిస్టుల బృందం తేల్చింది. అమెరికా తూర్పు కోస్తా తీర నగరాల్లో భూమి ఏటా 1 నుంచి 2 మిల్లీమీటర్ల చొప్పున కుంగుతున్నదని, దీనికి రెండు, మూడు రెట్లు డెలావర్, మేరీల్యాండ్, దక్షిణ కరోలినా, జార్జియాల్లో ఉందని తేల్చారు. ఇందుకు సంబంధించిన ఉప గ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది.