గుజరాత్‌లోని ద్వారకాలో భారత్‌లోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఓఖా, బెయిత్ ద్వారకా ద్వీపాలను కలుపుతూ ఈ వంతెనని నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.979 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఓల్డ్ ద్వారకా, న్యూ ద్వారకాని ఇది అనుసంధానం చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. నాలుగు లేన్‌లతో ఈ నిర్మాణం చేపట్టారు. 27.20 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించారు. ఫుట్ పాత్ కోసం 2.50 మీటర్ల వెడల్పుని కేటాయించారు. ఈ ఫుట్‌పాత్‌నీ చాలా ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. గోడలపై భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు పెయింట్ చేశారు. ముందు దీన్ని సిగ్నిచర్ బ్రిడ్జ్‌గా చెప్పిన ప్రభుత్వం ఆ తరవాత సుదర్శన్ సేతు అనే పేరు పెట్టింది. ఓఖా పోర్ట్‌కి సమీపంలో ఉన్నబేట్ ద్వారకలో శ్రీకృష్ణుడి ద్వారాకాధీష్ ఆలయం ఉంది. ఈ వంతెనను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు.