చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన చిత్రం రికార్డ్‌బ్రేక్. ఈ సందర్భంగా విలేకరులతో చదలవాడ మాట్లాడారు. తెనాలిలో మాది చిన్న కలప వ్యాపారం. నేను నిద్రలో కూడా సినిమాల నే కలవరిస్తాను. అందుకే ఊరు వదిలి హైదరాబాద్ చేరుకున్నాం. సినీ కళామతల్లి వల్ల నిలదొక్కుకున్నాం అన్నారు. కంటెంట్ ఉన్న సినిమాకు కచ్చితంగా ఆదరణ ఉంటుందని బిచ్చగాడు తెలియజెప్పింది.అందుకే ప్రేక్షకుల మనసులకి హత్తుకునేలా నిజానికి దగ్గరగా రికార్డ్‌బ్రేక్ తీశాను. తల్లి కోసం బిడ్డ కష్టం బిచ్చగాడు. బిడ్డలకోసం తల్లి పడే కష్టం ఈ రికార్డ్ బ్రేక్ అని తెలిపారు. విజయ నాగిరెడ్డి, రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి ఇన్‌పుట్స్ తీసుకుని సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించామని, అలా చేయడంతో సినిమా మరింత క్వాలిటీగా తయారైందని ఆయన చెప్పారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత మంచి టెక్నికల్ వాల్యూస్‌తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమాల కంటే గొప్ప సినిమాలు తీసి చూపిస్తానని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 8న విడుదల కానుంది.