విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం గామి. చాందినీ చౌదరి కథానాయిక. నిర్మాత కార్తీక్ శబరీశ్. విద్యాధర్ కాగిత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిందని, విమర్శకుల ప్రశంసలందుకుంటున్నదని నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలాంటి కొత్తవాళ్లకు సినిమా తీయడమే పెద్ద విషయం. అలాంటిది మేం తీసిన సినిమా విడుదల అవ్వడం, అది ప్రజాదరణ పొందటం, నమ్మలేకపోతున్నాం. నిజంగా మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన సినిమా ఇది. అన్నారు
షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్లందరం ఒకచోట చేరి తీసిన సినిమా మను. ఓ విధంగా గామి కి కూడా అదే స్పూర్తి. దర్శ కుడు విద్యాధర్కి వీఎఫ్ఎక్స్లో మంచి పట్టు ఉంది. వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్సే ఇందులో 70శాతం ఉంటాయి. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ బడ్జెట్లో క్వాలిటీ గ్రాఫిక్స్‌ని తీసుకురాగలిగాడు విద్యాధర్. విశ్వక్ మార్కెట్ పెరిగాక బడ్జెట్‌ని పెంచాం. అతని సినిమాలు వరుసగా విజయాలు సాధించడం కూడా మాలో ధైర్యాన్ని నింపింది. వి సెల్యులాయిడ్ వారు చేరాక మేం సేఫ్ అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే రాజీ పడకుం డా సినిమా తీశాం. చూసిన వారంతా సినిమా బావుందని మెచ్చుకుంటుంటే సంతృప్తిగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు.