సింగపూర్లో తెలుగు బ్రాహ్మణులు మహాశివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం మహాశివరాత్రి పండుగ రోజున అరసకేసరి శివాన్ మందిరము ప్రాంగణములో ఏకాదశ రుద్రాభిషేకాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతదేశం నుంచి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్ను తో పంచ లింగాలను పార్థివ లింగాలుగా తయారు చేసి పూజా కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 7 గంటల పాటు జరిగిన పూజలో 50 మందికి పైగా రుత్వికులు, తెలుగు బ్రాహ్మణలు పాల్గొన్నారు. మహిళలు లలితా పారాయణం పటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 2014 నుంచి సింగపూర్లో పలు కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొన్నారు.
నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా ప్రతినెలా రుద్రాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మహాశివరాత్రి రోజున, అభిషేకం, జాగరణ కార్యక్రమాలు చేపట్టడం తమలో భక్తిభావం మరింత పెరిగిందని అన్నారు.