టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల జావెలిన్ త్రో (ఎఫ్64) ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ సుమిత్ అంటిల్ విజయం సాధించి మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో వేశాడు. సుమిత్ అంటిల్ అత్యధికంగా 68.55 మీటర్ల దూరం తన ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. సుమిత్ 66.95 మీటర్లు విసిరి రౌండ్ 1 తర్వాత అగ్రస్థానంలో నిలిచి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. తన రెండో ప్రయత్నంలో 68.08 మీటర్ల త్రో విసిరి మళ్లీ రికార్డు నెలకోల్పాడు. వరుసగా మూడు, నాలుగు త్రోలలో, అతను 65.27 మీటర్లు, 66.71 మీటర్లు విసిరాడు. అనంతరం ఐదో రౌండ్లో 68.55 మీట్లర్ల దూరం విసిరి మరోసారి తన రికార్డును తానే బద్దలుకొట్టి వరల్డ్ రికార్డుకెక్కాడు.