దక్షిణాఫ్రికాలో మరో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూసింది. కరోనా సీ.1.2 రకం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న వైరస్ రకాలతో పోలిస్తే ఈ వేరియంట్‌కు మ్యుటేషన్ రేటు అధికంగా ఉంది. ఈ వేరియంట్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకావం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన సీ.1.2 రకం కరోనా దాటికి వ్యాక్సిన్లు కూడా పని చేయడం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్‌ఐసీడీ), క్వాజులు`నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్ ఫాం (క్రిస్ప్) సంస్థల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.
సీ.1.2 రకం కరోనా కేసులు చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చగల్, స్విట్జర్లాండ్ దేశాల్లో బయటపడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణాఫ్రికాలో కరోనా ఫస్ట్ వేవ్‌లో తీవ్ర ప్రభావం చూపించిన సీ.1 రకంతో పోలిస్తే సీ.1.2 వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని చెప్పారు.