రష్యాలోని రెండో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ లో అనుమానాస్పద మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా కంపెనీలో మరో కీలక అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ విటాలీ రాబర్టస్ (53) తన కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.మార్చి 12న రాబర్టస్ తన కార్యాలయం లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. అయితే, అతడి మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
రాబర్టస్ తన మరణానికి ముందు తలనొప్పిగా ఉందని, అందుకోసం మందులు అడిగినట్లు తెలిసింది. ఆ తర్వాత కార్యాలయంలోని తన గదిలోకి వెళ్లి అతడు ఎంతసేపటికీ బయటకు రాలేదు. ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులు రాబర్టస్ గదిలోకి వెళ్లి చూడగా, అతడు ఉరేసుకొని శవమై కనిపించాడు. రాబర్ట స్ లుకోయిల్ సంస్థలో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన నాటి నుంచి లుకోయిల్ సంస్థలో ఇది నాలుగో అనుమానాస్పద మరణం. అంతకు ముందు మే 2022లో లుకోయిల్ టాప్ మేనేజర్ 43 ఏళ్ల అలెగ్జాండర్ సుబోటిన్ మైటిష్చి పట్టణంలోని తన ఇంటి బేస్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.