అమెరికాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో విక్టరీ సాధించిన తర్వాత పుతిన్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా ప్రజాస్వామ్య దేశం కాదు అని ఆయన అన్నారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాల పట్ల యావత్ ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాము చాలా సంయమనంతో ఉన్నామని, కానీ అమెరికాలో విపత్తు ఉందని, అది ప్రజాస్వామ్య దేశం కాదు అని పుతిన్ ఆరోపించారు. అమెరికా సర్కార్ తన వద్ద ఉన్న అన్ని అధికారాలను వాడుకుని, దేశాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిపై దాడి చేస్తోందని ఆరోపించారు. డోనాల్డ్ ట్రంప్‌ను బైడెన్ ప్రభుత్వం వేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థి రేసులో ట్రంప్ ముందు వరుసలో ఉన్నా, ప్రభుత్వం మాత్రం కేసులతో నిర్వీర్యం చేస్తోందన్నారు. విదేశీ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోదు అని, అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా వారితో రష్యా కలిసి పనిచేస్తుందన్నారు.