అఫ్గానిస్తాన్ నుంచి తమ సేనల ఉపసంహరణతో దౌత్యపరంగా తాము అక్కడి నుంచి నిష్క్రమించినట్లైందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక నుంచి దౌత్య సంబంధాలను ఖతార్ నుంచి నిర్వహిస్తామని అన్నారు. అమెరికా, అఫ్గనిస్తాన్ సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందని అన్నారు. మానవతా దృక్పథంతో అఫ్గన్ ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటామని బ్లింకెన్ స్పష్టం చేశారు. తాలిబన్ ప్రభుత్వం ద్వారా కాకుండా, ఐక్యరాజ్యసమితి, ఎన్జీవోల వంటి స్వతంత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ సహాయం అందుతుందని పేర్కొన్నారు. అఫ్గన్‌ను వీడాలనుకున్న ప్రతి అమెరికన్, అఫ్గన్, ఇతర పౌరులను సురక్షితంగా తరలించామని తెలిపారు. అమెరికా పౌరులు అక్కడే చిక్కుకుపోయారన్న త్వరలోనే వారిని మాతృదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రయాణాలపై తాలిబన్లు ఆంక్షలు విధించవద్దని, మహిళలు, మైనార్టీ హక్కులను కాలరాసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు.