పెరూకు చెందిన 124 ఏండ్ల మార్సిలోనా అబద్ ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా భావిస్తున్నారు. అబద్ హువాంకో ప్రాంతం లో 1900 సంవత్సరంలో జన్మించారని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్యకర జీవనశైలి అనుసరించడం, ప్రశాంతంగా ఉండటమే అబద్ దీర్ఘాయువు రహస్యమని వారంటున్నారు. హువాంకా ప్రాంతంలోని పచ్చదనం, జంతుజాలం మధ్య ప్రశాంతంగా జీవించడమే అబద్ ఆరోగ్యానికి కారణమని పెరూ ప్రభుత్వం అధికారులు తెలిపారు. 12 దశాబ్ధాలకు పైగా జీవన ప్రస్ధానాన్ని దాటిన అబద్ ఏప్రిల్ 5న తన 124వ బర్త్‌డేను జరుపుకున్నారని, గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వృద్ధుడిగా అబద్ పేరు నమోదు చేసేందుకు తాము సాయపడతామని పెరూ అధికారులు తెలిపారు.
చగ్లాలోని ఓ చిన్న పట్టణంలో జన్మించిన అబద్ శతాధిక వృద్ధుడైనా 2019లో పెరూ ప్రభుత్వం ఆయనను గుర్తించి ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు పెన్షన్ మంజూరు చేసింది. పండ్లు అధికంగా తీసుకోవడంతో పాటు గొర్రె మాంసం తినడమే తన చురుకుదనం, ఆరోగ్యానికి కారణమని అబద్ చెబుతున్నారు. సీనియర్స్ వెల్ఫేర్ హోంలో ఉంటున్న అబద్ అక్కడే తన 124వ బర్త్‌డేను జరుపుకున్నారు.