Namaste NRI

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సాస్‌ సిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

అమెరికాలోని కాన్సాస్‌ నగరంలో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సాస్‌ సిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు.  స్థానిక ఒలాతే నార్త్‌వెస్ట్‌ హైస్కూల్లో  క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలకు నిర్వహించారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మధు గంట స్వాగత ఉపన్యాసంతో వేడుకలు ప్రారంభమైయ్యాయి.  స్థానిక హిందూ ఆలయ పూజారి శ్రీనివాసాచారి పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ప్రార్థనా గీతంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  రఘు వేముల, చందన తియాగూర, శ్వేత అడుసుమిల్లి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సందడిగా నిర్వహించారు.

 తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కూచిపూడి, భరతనాట్యం, జానపద, శాస్త్రీయ నృత్యాలతో చిన్నారులు, పెద్దలు సందడి చేసి అందరినీ అలరించారు. ఇటీవల బాగా పాపులర్‌ అయిన కుర్చీని మడతపెట్టి, పల్సర్‌ బండి పాటలకు పలువురు చేసిన డ్యాన్సులు అందరినీ ఉర్రూతలూగించాయి.  ఈ వేడుకల్లో  నూతన కార్యవర్గ సభ్యులను ఈ సంవత్సరం టీఏజీకేఎస్‌ అధ్యక్షుడు చంద్ర యక్కలి, కొత్త ట్రస్టు సభ్యులను ట్రస్ట్‌ చైర్‌ శివ తియగూర అందరికీ పరిచయం చేశారు.  టీఏజీకేఎస్‌ అధ్యక్షుడు చంద్ర యక్కలి మాట్లాడుతూ  తన ప్రసంగంలో తెలుగు భాష ప్రత్యేకతను వివరించడంతో పాటు ఇంట్లో పిల్లలు, పెద్దలు అంతా తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. పలు సాంస్కృతిక పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

చివరగా టీఏజీకేఎస్‌   ఉపాధ్యక్షులు శ్రావణి మేక ధన్యవాద తీర్మానం, జనగణమన గీతంతో సాంస్కృతిక కార్యక్రమాలను ముగించారు. ఈ సందర్భంగా అందరికి తెలుగు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యకర్తలతో పాటు స్పన్సర్లందరికీ అసోసియేషన్‌ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  ఉగాది వేడుకలకు దాదాపు 650 మందికి పైగా తెలుగు వారు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events